భగవన్నామస్మరణతో కష్టాలు దూరం : సువిధ్యేంద్రతీర్థ స్వామి
ఆస్థానమండపంలో పురందరదాసుల అరాధనా మహోత్సవాలు
భగవన్నామస్మరణతోనే మానవుల కష్టాలు దూరమవుతాయని బెంగళూరులోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి సువిధ్యేంద్రతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో జరిగాయి.
ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమ భక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు. ఇలాంటి పరమ భక్తులను గౌరవిస్తూ జయంతి, వర్ధంతులను నిర్వహించడం ద్వారా భగవంతుడు సంతోషపడతారన్నారు.
నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు. పురందరదాసులవారు దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్తాన్ని, శరణాగతి విధానాన్ని తెలియజేశారని వివరించారు.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. అనంతరం స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.
అంతకుముందు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దాస సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పలువురు భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
జనవరి 21న నారాయణగిరి ఉద్యానవనాల్లో సంకీర్తనాలాపన
ఆరాధనోత్సవాల్లో భాగంగా జనవరి 21న శనివారం సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు శ్రీవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి శ్రీ పురందరదాస సంకీర్తనల బృందగానం నిర్వహిస్తారు. అదేవిధంగా, జనవరి 22న తిరుమలలోని ఆస్థానమండపంలో భజన కార్యక్రమాలు, నగర సంకీర్తనం తదితర కార్యక్రమాలు చేపడతారు.