వారాహి అంటే దుష్టులను శిక్షించేది అని అర్థం
తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాటం
కొండగట్టులో వారాహి వాహనం నుంచి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్ధం అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు అనంతరం వాహనంపై నుంచి మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మనిచ్చారు. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. కానీ నన్ను అంజన్న, ఈ నేల తల్లి కాపాడారు.
అందుకే ఏ ముఖ్య కార్యక్రమం ప్రారంభించినా కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తాను. ఇక్కడ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. నరసింహ స్వామిగా, ఆంజనేయస్వామిగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకం. జనసేన పార్టీ సామాన్యుడి కోసం పని చేసే పార్టీ. తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాడుతుంద”ని అన్నారు.
వారాహి సంకల్పసిద్ధిరస్తు
విజయాల వారాహి వైభవంగా సిద్ధం అయ్యింది. దుష్టులను శిక్షించే దుర్గాదేవి అంశ వారాహి మాత పేరుతో జనసేన ప్రచార రథం పరుగులు తీసేందుకుగాను సంప్రదాయబద్ధమైన పూజలు నిర్వహించారు. విజయ తీరాల వైపు ప్రయాణించేందుకు దూసుకువస్తోంది. ఎల్లవేళలా అభయమిచ్చే శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో తొలి ప్రసంగం చేసి, వాహనాన్ని లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. వారాహి వాహనం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ప్రారంభించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్నారు. కొండగట్టు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సభక్తికంగా అర్చనలు చేశారు.
మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామికి ప్రీతి పాత్రమైన తమలపాకులు పూజ ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ గారితో చేయించారు. స్వామివారికి పూలు, పళ్ళు సమర్పించారు. సంప్రదాయ వస్త్రధారణ, నుదుట సింధూరం ధరించి పూర్తి భక్తిప్రపత్తులతో పూజల్లో పాల్గొన్నారు.
విజయోస్తు
స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో వాహన ప్రారంభ పూజలు జరిపిన వేద పండితులు వారాహి వాహనానికి శుభం కలిగేలా గుమ్మడికాయ కొట్టి హారతి అందించారు.
ఈ సందర్బంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పండితులు సంకల్ప సిద్ది చేయించారు. తిరుగులేకుండా విజయాన్ని మోసుకు వస్తుందని అభిలషించారు.
అనంతరం వారాహి పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవనసుతుడు ఆంజనేయ స్వామి సాక్షిగా ఆలయం ముందే మొదటి ప్రసంగం చేసి, లాంఛనంగా వారాహి ప్రారంభించారు.
కొండగట్టు పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రాంత జన సైనికులనుంచి అపురూప స్వాగతం లభించింది. అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికిన జనసైనికులు, గజ మాలలు వేసి అభిమానం చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేమూరి శంకర్ గౌడ్, బి. మహేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం, తంగెళ్ళ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.