కదిరి సిఐని సస్పెండ్ చేయాలి: రామకృష్ణ
కదిరి పట్టణంలో తొడలు కొడుతూ, మీసం మేలేస్తూ ఉద్రిక్త పరిస్థితులకు కారకుడైన కదిరి పట్టణ సీఐ తమ్మిశెట్టి మధును సస్పెండ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. మహిళలపై కనీస గౌరవం లేకుండా నీచంగా దుర్భాషలాడి, లాటీచార్జ్ చేసిన సిఐ మధును అరెస్టు చేయాలన్నారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు.
కదిరి పట్టణంలో చిన్న వివాదం సీఐ తమ్మిశెట్టి మధు దురుసు ప్రవర్తనతో గాలివానగా మారింది. సీఐ మధు మహిళ కౌన్సిలర్ సుధారాణిపై చిందులు తొక్కుతూ, పరుష పదజాలంతో దుర్భాషలకు దిగారు. సీఐ ప్రవర్తనతో విసుగుచెందిన టిడిపి నిరసన ధర్నా చేపట్టింది. ఆ ధర్నాలో కూడా సీఐ మధు మహిళలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ లాఠీలు ఝులిపించారు. వైసిపి వర్గీయులతో రాళ్లదాడికి కారకులయ్యారు. వైసిపి వర్గీయుల భుజాలపై ఎక్కి తొడలు కొడుతూ, మీసం మెలేస్తూ ఒక వీధి రౌడీలా సిఐ మధు వీరంగం సృష్టించారు. శాంతి భద్రతలను కాపాడుతూ, బాధ్యతా యుతంగా మెలగాల్సిన సీఐ మధు దుందుడుకు వైఖరితో కదిరి పట్టణం రణరంగంగా మారింది. సీఐ మధు వైఖరి పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ.
కదిరి పట్టణంలో ఘర్షణ వాతావరణానికి తెరతీసిన కదిరి పట్టణ సీఐ తమ్మిశెట్టి మధును తక్షణమే సస్పెండ్ చేయాలి. మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మధుని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం.