టీ20 సంచలనం.. 10 పరుగులకే జట్టంతా ఆలౌట్
కార్గజెనా(స్పెయిన్): టీ20 క్రికెట్ అంటే ఆ మజానే వేరు. స్టేడియంలో కురిసే పరుగుల వాన ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. టీ20 క్రికెట్‌లో జరిగేది ఇదే. బంతికి బ్యాట్‌కు జరిగే యుద్ధంలో చాలా వరకు బ్యాటే విజయం సాధిస్తుంది. అయితే, స్పెయిన్ జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇందుకు భిన్నంగా జరిగింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది. ఓ జట్టు కేవలం 10 పరుగులకే చాపచుట్టేసింది.
‘ఇస్లే ఆఫ్ మ్యాన్’(Isle of Man)-‘స్పెయిన్’(Spain) జట్ల మధ్య ఆదివారం లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులకే కుప్పకూలింది. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ స్కోరు సాధించిన చెత్త రికార్డు ఇప్పటి వరకు సిడ్నీ థండర్స్ పేరున ఉండగా ఇప్పుడా రికార్డును ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు తుడిచిపెట్టేసి సరికొత్త చెత్త రికార్డును మూటగట్టుకుంది.
2022-23 బిగ్‌బాష్ లీగ్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్(Adelaide Strikers)తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్(Sydney Thunder) 15 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక, తాజా మ్యాచ్‌లో ఏడుగురు ఆటగాళ్లు ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ముగ్గురు ఆటగాళ్లు చెరో రెండు పరుగుల చొప్పున చేయగా, జోసెఫ్ బరోస్ చేసిన నాలుగు పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లు అతిఫ్ మెహమూద్(Atif Mehmood), మహమ్మద్ కమ్రాన్ ( Mohammad Kamran) చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. కమ్రాన్ హ్యాట్రిక్ తీసుకున్నాడు.