క్యాన్సర్ ఆసుపత్రి భవనాల పనులు పూర్తి చేయాలి
– టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న శ్రీ బాలాజి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ క్యాన్సర్ రీసర్చ్ ( క్యాన్సర్ ఆసుపత్రి) కి సంబంధించిన భవనాల నిర్మాణం, డిజైన్లు , వైద్య పరికరాలు, సిబ్బంది సమీకరణ వంటి పనులన్నీ నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశించారు.
క్యాన్సర్ ఆసుపత్రి పనుల పురోగతిపై గురువారం ఆమె శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆసుపత్రి ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని జేఈవో చెప్పారు. మార్చి 31వ తేదీలోగా భవనాల ప్లాన్, డిజైన్లు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. స్విమ్స్, ఎపి ఎం ఐ డిసి , స్కై డోమ్ సంస్థ ప్రతినిధులు సమన్వయంతో పనులు ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు.సందేహాలు ఉంటే పరస్పరం చర్చించుకుని నివృత్తి చేసుకోవాలని, అవసరమైతే తన దృష్టికి,చైర్మన్,ఈవో దృష్టికి కూడా తీసుకురావచ్చని అన్నారు. ప్రతి పనికి నిర్ణీత కాల వ్యవధి పెట్టుకుని ఆలోగా పనులు పూర్తి చేయాలన్నారు.
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకాధికారి డాక్టర్ జయచంద్రారెడ్డి, టీటీడీ ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, ఎ పి ఎం ఐ డి సి ఈఈ శ్రీ ధనుంజయ రెడ్డి, స్కై డోమ్ సంస్థ ప్రతినిధి శ్రీమతి సుశీ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.