కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌గా మలయప్ప

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

క‌ల్ప‌వృక్ష వాహనసేవలో కళావైభవం

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉద‌యం క‌ల్ప‌వృక్ష‌ వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.

హైదరాబాదుకు చెందిన సంతోశ్ బృందం పేర్ని నృత్యం, తిరుపతికి చెంద‌న సుకన్య బృందం కృష్ణ తులాభారం, తెలంగాణకు చెందిన సి.హెచ్.ప్రశాంత్ బృందం ఒగ్గుడోలు ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా, చెన్నైకి చెందిన భారత్ కళా అకాడమీ గజ్జెనృత్యం, తెలంగాణ రాష్ట్రం జనగాం కు చెందిన పి.శ్రీనివాస్ బృందం డప్పు వాయిద్యం, ఇ. మహేశ్వరి బృందం ఘట విన్యాసం, బి.కవిత బృందం బోనాల నృత్య రూపకం, లంబాడి నృత్యం, విశాఖపట్నంకు చెందిన ఎన్.రాగబుజ్జి బృందం కోలాటం, కె.సునీత బృందం లెజిమ్ వాయిద్యం భ‌క్తుల‌ను అల‌రించాయి. మొత్తం 10 కళాబృందాల్లో 226 మంది కళాకారులు పాల్గొన్నారు.

టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ‌ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply