తిరుమలలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు.
“విమానార్చన కల్పము” – డా|| పి. భావనారాయణాచార్యులు
వైష్ణవాగమాలలో వైఖానస ఆగమాన్ని విష్ణ్వంశ సంభూతులైన విఖనస మహర్షి భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులకు స్వయంగా ఉద్బోధించి, ప్రచారం చేయమని ఆదేశించి, నలుగురికీ నాలుగు క్షేత్రాలను నిర్దేశించాడు. అత్రిమహర్షిచే విఖనస భగవచ్ఛాస్త్ర ఆగమోక్తంగా పూజించబడిన శ్రీనివాస క్షేత్రమే తిరుమల.
తిరుమల శ్రీవారి ఆలయంలో అత్రిమహర్షిచే వైఖానస ఆగమోక్తంగా ప్రారంభించబడిన పూజాదికాలు నేటికీ నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. అధికార, తంత్ర, సంహిత, కాండము అనే పేర్లతో ప్రసిద్ధినొందినది. ఈ వైఖానస భగవచ్ఛాస్త్ర వాఙ్మయరాశిలో మరీచి మహర్షిచే ఉపదేశించబడిన పరమోత్కృష్టమైన గ్రంథం “శ్రీవిమానార్చన కల్పము”. ఇది క్రియా, జ్ఞాన, యోగశాస్త్ర రహస్యములు నిక్షిప్తం చేయబడిన మహత్తర గ్రంథరాజము ఈ “శ్రీవిమానార్చన కల్పము”. మొదటి 10 పటలాలను (అధ్యాయాలను) శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం వైఖానస ఆగమవిభాగ అధ్యక్షులు డాక్టర్ పరాశరం భావనారాయణాచార్యులుగారు ఆంధ్రానువాదం చేశారు. ఈ గ్రంథానికి శ్రీవేంకటేశ్వర శిల్పకళాశాల పూర్వ విభాగాధ్యక్షులు శ్రీ పల్లెబోయిన సుబ్రహ్మణ్య స్థపతి గారు సందర్భానుసారంగా చిత్రములను సుందరంగా రూపొందించి, సచిత్రముగా అందిస్తున్నారు. ఆర్ష సంప్రదాయములను పరిరక్షించుటలో భాగంగా ఈ గ్రంథాన్ని తి.తి.దేవస్థానములు స్వీయముద్రణగా ముద్రిస్తున్నది.
“అన్నమయ్య సంకీర్తనా కౌముది” – శ్రీ మల్లాది సూరిబాబు
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలను సంగీత ప్రపంచానికి స్వరసహితంగా అందించాలనే సంకల్పంతో ఇదివరకే సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు స్వరాలను సమకూర్చగా స్వరసహితంగా నొటేషన్స్) ఆయా సంగీత గ్రంథాలను తి.తి.దే.ముద్రించి, సంగీత ప్రియులకు అందుబాటులోనికి తీసుకువచ్చింది.
ప్రస్తుతం గ్రంథం “అన్నమయ్య సంకీర్తన కౌముది” సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, సుస్వరగాయకరత్న శ్రీ మల్లాది సూరిబాబు గారి రచన. అన్నమాచార్యుల సంకీర్తనలలో అమూల్య రత్నాలవంటి 50 సంకీర్తనలను ఎంపిక చేసి, వాటికి స్వరలిపి(నొటేషన్స్) ఏర్పరిచి, సంగీత అభ్యాసానికి ఉపయోగపడేలా స్వరయుక్తంగా తీర్చిదిద్దిన శ్రీ మల్లాది సూరిబాబుగారు ప్రశంసాపాత్రులు.
“రామనాటక కీర్తనై” (తమిళం) – డా॥ ఆర్.వి.కమలకణ్ణన్
రామకథ రమణీయం. వాల్మీకి రామాయణాన్ని భారతీయ భాషలలో అనేకమంది కవులు అనేక ప్రక్రియలలో అనువాదం చేసుకున్నారు. తమిళంలో 17వ శతాబ్దానికి చెందిన అరుణాచల కవిరాయర్ ‘రామనాటక కీర్తనై’ అనే పేరుతో రచన చేశారు. ఈ రచన కంబరామాయణాన్ని అనుసరించి చేసినది. ఈ గ్రంథాన్ని ప్రముఖ తమిళ వైష్ణవ పండితులైన డా|| ఆర్ వి.కమలకణ్ణన్ గారు రామనాటక కీర్తనలకు కంబరామాయణ వ్యాఖ్యతోపాటు, ఆళ్వారుల సాహిత్యంలోని, వివిధ పురాణాలలోని విశేషాలను జోడించి తమిళంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గ్రంథం శ్రీవారి తమిళ భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్ఈ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.