గరుడ సేవ సందర్భంగా భద్రత ఏర్పాట్ల పరిశీలన
శ్రీవారి గరుడోత్సవం నేపథ్యంలో శ్రీవారి నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, క్యూలైన్లు ప్రాంతాల లో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించి, పోలీసులు పాటించవలసిన జాగ్రత్తలను వివరించిన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,
జిల్లా ఎస్పీ గారు మాడవీధులలో టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి గారితో భద్రతాపరమైన ఏర్పాట్లపై చర్చించిచారు, అనంతరం బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సూచనలను, పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
గత నాలుగు రోజులుగా బ్రహ్మోత్సవాలు విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ఈ అనుభవాన్ని ట్రైల్ రన్ గా భావించి ఈరోజు పరమ పవిత్రమైన గరుడ సేవను పురస్కరించుకొని సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున బందోబస్తు సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో విధులను సమర్థవంతంగా నిర్వర్తించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి గరుడోత్సవం దర్శనం కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు.
అదే సమయంలో అత్యవసర వాహనాలకు ఎక్కడ ఆటంకం కలగకుండా మార్గాలను నిత్యం క్లియర్ గా పెట్టుకోవాలన్నారు. విధి నిర్వహణలో మీకు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
గరుడోత్సవ దర్శనం చేసుకునేటప్పుడు చిన్నపిల్లలను, వయోవృద్ధులతో వచ్చే భక్తులు తగు జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. క్రైమ్ పార్టీ పోలీసులు భక్తులలో మమేకమై పాత నేరస్తులను, అనుమానితులను అదుపులోకి తీసుకొని నేర నియంత్రణ చర్యలు చేస్తున్నారన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు నుండి మాడవీధులకు, గ్యాలరీలకు అనుసంధానించే క్యూలైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ విధులు నిర్వర్తించే పోలీసు వారు అత్యవసర సమయాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పార్కింగ్ ప్రాంతాలను చేరుకునే మార్గాలను కూడా పరిశీలించి, అక్కడ బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలనీ. అదే సమయంలో స్టెరిలైజింగ్ పార్టీ వారి సహాయంతో రోడ్లపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్., నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ తిరుమలేశ్వర రెడ్డి ఐపీఎస్., అదనపు ఎస్పీ పరిపాలన శ్రీ వెంకట్రావు గారు పాల్గొన్నారు