లోకసంక్షేమం కోసం చతుర్వేద హవనం
లోక సంక్షేమం కోసం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, ధార్మిక ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని ఆంధ్ర గీర్వాణ కళాశాల ప్రాంగణంలో మంగళవారం శ్రీనివాస రుక్ సంహితచతుర్వేద హవనం ప్రారంభమైంది. మార్చి ఆరో తేదీ వరకు ఏడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది.
ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీషణశర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద పారాయణాలు నిర్వహించారు. సాయంత్రం టీటీడీ అన్నమాచార్య కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను వినిపించారు.
చివరి రోజు కంచి కామకోటి పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమం జరగనుంది.
