10ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తలకోన అటవీ ప్రాంతంలో పాపనాశం ఫారెస్టు బీట్ పరిధిలో బుధవారం 10ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన టీమ్ మంగళవారం నుంచి కూంబింగ్ చేపట్టింది.
ఆర్ఎస్ఐ లింగాధర్ బృందం తిరుమల నుంచి తలకోన మీదుగా కూంబింగ్ చేపట్టింది. పాపనాశం ఫారెస్టు బీట్ పరిధిలో గుంజన సెక్షన్ వద్ద బుధవారం తెల్లవారు జామున కొంత మంది దుంగలను మోసుకుని వెళుతూ తారసపడ్డారు. వారిని హెచ్చరించి చట్టు ముట్టే ప్రయత్నం చేయగా, దుంగలు పడేసి చీకట్లో పారిపోయారు.
టాస్క్ ఫోర్సు సిబ్బంది వారిని వెంబడించడంతో ఒక స్మగ్లర్ దొరికాడు. అతను తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు ప్రాంతానికి చెందిన సురేష్(27)గా గుర్తించారు.
దుంగలతో పాటు స్మగ్లర్ ను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి, కేసు నమోదు చేశారు. ఎస్ఐ మోహన్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.
